హోటల్‌ కంటే.. తుపాకీ కొనడం సులువు

న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2020 ఆర్థిక వృద్ధిని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 6-6.5 శాతంగా అంచనా వేసింది.2020సంవత్సరానికి  ఇది 5 శాతంగా ఉంది. లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాలకు అధ్యక్షుడు రామనాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తరువాత 2019-2020 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అనతరం సభ రేపటికి వాయిదా పడింది.  రేపు  ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సభ ముందు ఉంచనున్నారు.



మరోవైపు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి వి సుబ్రమణియన్‌ ఎకనామిక్ సర్వే వివరాలను మీడియాకు వివరించారు. రుపాయి నోటు భారత సంపదకు చిహ్నం. అందుకే, సర్వే కవర్‌ పేజీని వంద రూపాయల నోటు పాత, కొత్త  రంగుల మేళవింపుతో వంకాయ రంగులో రూపొందించినట్టు చెప్పారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టికి మార్కెట్ అదృశ్య హస్తం, విశ్వాసం అనేవి రెండు స్తంభాలని సుబ్రమణియన్ అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన మార్కెట్ యొక్క అదృశ్య హస్తాన్ని బలోపేతం, నమ్మకంతో మద్దతు ఇవ్వడంపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. భారతదేశం  చైనా మధ్య ఎగుమతి పనితీరులో వ్యత్యాసాన్ని స్పెషలైజేషన్ ద్వారా వివరించాలని సుబ్రమణియన్ చెప్పారు. చైనా శ్రమతో కూడిన కారకాలలో ప్రత్యేకత కలిగి ఉంది. భారతదేశం కూడా దీన్ని అనుసరించాల్సిన అవసరం వుంది. దేశంలో ఒక హోటల్‌ను  ప్రారంభించడం కంటే, ఒక తుపాకీ లైసెన్సు సంపాదించడం చాలా సులువు అని సర్వే పేర్కొంది. ఒక పిస్తోల్‌ కలిగి వుండేందుకు కావల్సిన పత్రాల కంటే ఢిల్లీలో ఒక హోటెల్‌ తెరవాలంటే  ఎక్కువ  డాక్యుమెంట్లు కావాలని తెలిపింది.