న్యూఢిల్లీ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ప్రాజెక్టు కాంట్రాక్టర్ల సంస్థలపై ఆదాయపుపన్ను శాఖ సోదాలలో వెల్లడైన అవకతవకలను ఈ సందర్భంగా పిటిషనర్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సోదాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనను సాక్ష్యంగా చూపెట్టారు.
అలాగే మోటర్ల కొనుగోలుతోపాటు ప్రాజెక్టు పనుల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది.. సోదాలు జరిగిన సంస్థతో ప్రాజెక్టుకు సంబంధం లేదని వాదించారు. కాంట్రాక్టు సంస్థ తరఫు న్యాయవాది కూడా ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపారు. అయితే ఇరు పక్షాల వాదనలను నాలుగు వారాల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.